: చంద్రబాబు, మీ ఇష్టం.. ఎన్ని రోజులు గృహ నిర్బంధంలో ఉంచుతారో ఉంచండి: ముద్రగడ పద్మనాభం
'చంద్రబాబు గారూ.. నన్ను ఎన్ని రోజులు గృహ నిర్బంధంలో ఉంచుతారో మీ ఇష్టం’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఎందుకు చేశారో తెలియదని, తాను చేసే పాదయాత్ర మాత్రం ఆయన పాదయాత్రలా స్వార్థంతో కూడింది కాదని అన్నారు. ‘ఎన్నికల్లో మీరిచ్చిన హామీని అమలు చేయమని అడగటం తప్పా?’ అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబులా కేసులకు తాము భయపడమని, కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోమని అన్నారు. వచ్చే నెల 2వ తేదీన కాపు జేఏసీ నేతలతో సమావేశమై పాదయాత్ర గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘నిబంధనల పేరిట తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని, తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30, 144 అమలులో ఉండగా టీడీపీ నేతలు జనచైతన్య యాత్రలు ఎలా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ముద్రగడ ఆ లేఖలో ప్రశ్నించారు.