: మోదీ గారు.. మా అమ్మను మీరే రక్షించాలి: ప్రధానికి ఓ యువతి వినతి
టీ స్టాల్, కూరగాయల మార్కెట్, ఐరన్ షాపు, పెట్రోల్ బంక్, ఆసుపత్రికి... ఇలా ఎక్కడికి వెళ్లినా పెద్దనోట్ల రద్దు సమస్య ప్రజలను వెంటాడుతోంది. సరిపడా చిన్ననోట్లు లేక, బ్యాంకుల్లో, ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులను చూసిన ప్రజలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అత్యవసర వైద్య పరీక్షలు, ఆపరేషన్లు చేయించుకునే వారి పరిస్థితి అయితే, ఇక చెప్పనక్కర్లేదు.. ఏడుపొక్కటే తక్కువ అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ‘మోదీ గారు..మీరే, మా అమ్మను రక్షించాలి’ అంటూ ప్రధాని మోదీకి కోల్ కతాకు చెందిన పూజా గుప్తా అనే అమ్మాయి లేఖ రాసింది. కొన్ని రోజులుగా ఐసీయూలో ఉన్న తన తల్లి నిర్మలా గుప్తాకు కాలేయ మార్పిడి చేయాల్సి ఉందని ఆ లేఖలో ఆమె పేర్కొంది. కాలేయ మార్పిడికి రూ.30 లక్షలు అవసరమని, అందుకోసం.. తమ దుకాణాన్ని అమ్మి వేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అయితే, పెద్దనోట్ల రద్దు కారణంగా, తమ దుకాణాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయింది. ఎంత ప్రయత్నించినా తమ దుకాణాన్ని అమ్మలేకపోతున్నామని తెలిపింది. తన తల్లికి చికిత్స చేయాలంటే తమ వద్ద ఉన్న డబ్బు సరిపోదని, తమ అకౌంట్లలో ఉన్న డబ్బు తీసుకోవాలంటే సుమారు 20 నుంచి 30 రోజుల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారని ఆ లేఖలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడం లేదని, తన తల్లి ఆపరేషన్ కు నగదు సాయం చేయాలంటూ పూజాగుప్తా ప్రధానికి రాసిన ఆ లేఖలో విన్నవించుకుంది.