: భారత్ కు దీటుగా అణ్వాయుధాలను సిధ్ధం చేసుకుంటున్న పాక్: నిర్ధారించిన అమెరికా శాస్త్రవేత్తలు


పాకిస్థాన్ విషయంపై అమెరికా శాస్త్రవేత్తలు భారత్ కు పలు హెచ్చరికలు చేశారు. గత కొంత కాలంగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ను లక్ష్యంగా చేసుకుని పాక్ సరికొత్త చర్యలు చేపట్టిందని వారు పేర్కొంటున్నారు. అమెరికా మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ, పాక్ భారీ ఎత్తున అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా పది పాకిస్తానీ న్యూక్లియర్ బేస్ లను పరిశీలించిన అమెరికా శాస్త్రవేత్తలు ఈ మేరకు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఎఫ్ఏఎస్ కు చెందిన హన్స్ ఎమ్ క్రిస్టెన్సన్ మాట్లాడుతూ, ఎయిర్ బేస్ లలో అణ్వాయుధాల తయారీతో పాటు ఫైటర్ జెట్లకు వాటిని మోసుకెళ్లే సామర్ధ్యాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు. పది బేస్ లలో ఐదు గ్యారిసన్లు (సైనిక స్థావరాలు), రెండు ఎయిర్ బేస్ లను పాకిస్థాన్ సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ స్థావరాలకు 130 నుంచి 140 వార్ హెడ్ లను తరలించినట్టు ఆయన వెల్లడించారు. అలాగే అమెరికాతో జరిగిన ఒప్పందాల మేరకు జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎఫ్-16 ఫైటర్ల ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్ లను, మిరాజ్ ఫైటర్లకు రాడ్ ఎయిర్ లాంచ్ క్రూస్ మిస్సైల్ ను మోసుకెళ్లగల సామర్ధ్యాలను కూడా జోడించిందని ఆయన వెల్లడించారు. కరాచీకి పశ్చిమంగా ఉన్న మస్రూర్ ఎయిర్ బేస్ లో ఎఫ్-16 జెట్లకు అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలిగే శక్తి సామర్ధ్యాలను పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. పాక్ ఇందుకు చైనా సహకారం తీసుకుందని ఆయన వెల్లడించారు. అక్రో (సింధ్ ప్రావిన్స్), గుజ్రన్ వాలా (పంజాబ్ ప్రావిన్స్), ఖుజ్దర్ (బలూచిస్తాన్), పనో అక్విల్ (సింధ్ ప్రావిన్స్), సర్గోధాల్లో పాకిస్తాన్ ఈ అణ్వాయుధాలను తయారుచేస్తోందని ఆయన తెలిపారు. బహవాల్పూర్ లో గల ఆరో బేస్ ప్రస్తుతానికి నిర్మాణదశలో ఉందని ఆయన అన్నారు. దెరాఘాజిఖాన్ లో పాక్ నిర్మిస్తున్న ఎయిర్ బేస్ నిర్మాణం చూస్తుంటే అది న్యూక్లియర్ బేస్ కాదనే అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆయన చెప్పారు. ఈ బేస్ లలో గల అణ్వాయుధాలను ఉపయోగించి 100 కిలోమీటర్ల మేర లక్ష్యాలను తునాతునకలు చేయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, పశ్చిమ ఇస్లామాబాద్ లో గల పాకిస్తానీ నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ లో షాహీన్-2, బాబర్ మిస్సైల్స్ ను కూడా సిద్ధం చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ మొత్తం తతంగానికి సాంకేతిక సామర్థ్యాన్ని చైనా అందిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News