: రష్యాతో చేతులు కలపాలని ట్రంప్ కు సలహా ఇచ్చిన వ్యక్తికి కీలక పదవి!
త్వరలోనే అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తనకు ఎంతో ప్రీతిపాత్రుడైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మైఖేల్ ఫ్లిన్ కు తమ దేశ భద్రతా సలహాదారు పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. 56 ఏళ్ల మైఖేల్ ప్లిన్ గత కొన్నాళ్లుగా ట్రంప్‌కు సైనిక విషయాలపై సలహాలిస్తున్నారు. గతంలో మైఖేల్ ప్లిన్ పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై ప్రస్తావించారు. పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రవాదులను ప్రోత్సహించే చర్యలను మానుకోకుంటే ఆ దేశానికి తమ దేశం ఆర్థిక సాయం చేయకూడదని రాశారు. ట్రంప్ రష్యాకు అనుకూల వ్యాఖ్యలు చేయడానికి కూడా ఇతనే కారణమని తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే క్రమంలో అవసరమైతే రష్యాతో చేతులు కలపాలని ఆయననే ట్రంప్‌కు సలహా ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం అమెరికా భద్రత సలహాదారుగా సుసాన్ రైస్ ఉన్నారు.