: అద్భుతంగా స్టంప్ చేసిన సాహా... రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుతమైన రన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ (455) కు దీటుగా బదులిచ్చేందుకు బరిలో దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే షమి విసిరిన అద్భుత బంతితో కుక్ వికెట్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లిష్ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టే బాధ్యతను రూట్, హమీద్ తీసుకున్నారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ, మ్యాచ్ పై పట్టుసాధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడేజా వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్ చివరి బంతిని జో రూట్ లెగ్ సైడ్ గా తరలించాడు. అయితే, బౌండరీ లైన్ నుంచి దూసుకొచ్చిన జయంత్ యాదవ్ బంతిని లాఘవంగా పట్టుకుని విసిరాడు. అది వికెట్లను చేరకపోవడంతో దానిని సరిగ్గా అంచనా వేసిన వృద్ధిమాన్ సాహా వికెట్లను వదిలి ముందుకు పరిగెత్తాడు. అప్పటికే ఒక పరుగు తీసిన రూట్ ఆగిపోగా, రెండో పరుగు కోసం హమీద్ దూసుకెళ్లాడు. రూట్ వారించడంతో వెనక్కి పరుగెత్తిన హమీద్ ను గమనించిన సాహా వెనక్కి తిరగకుండా, డీప్ నుంచి వచ్చిన బంతిని ఒడిసి పట్టి, ఒడుపుగా వెనక్కి తిరగకుండా వికెట్ల వైపు విసిరాడు. దీంతో హమీద్ క్రీజును చేరేలోపే వికెట్లు కిందపడ్డాయి. దీంతో టీమిండియా శిబిరంలో ఆనందం, ఇంగ్లండ్ ఆటగాడు పెవిలియన్ చేరడం జరిగిపోయాయి. దీంతో 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 72 పరుగులు చేసింది. తొలి వికెట్ తీసే క్రమంలో షమి వేసిన బంతి వికెట్ ను గిరాటేయడం విశేషం.