: ఆర్‌బీఐ కార్యాలయం వద్ద మంత్రులతో కలిసి ఆందోళనకు దిగిన కేరళ ముఖ్యమంత్రి
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రోజు తిరువనంతపురంలోని ఆర్‌బీఐ శాఖ ఎదుట ఆందోళన నిర్వహించారు. సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడిని రద్దు చేసిన అంశంపై ఆయన మండిపడ్డారు. ఈ ఆందోళనలో పలువురు కేరళ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పినరయి విజయన్ తన ఫేస్‌బుక్‌లో ఖాతాలో కేరళ సహకార రంగం నల్లధనం ఉండే చోటు కాదని పేర్కొన్నారు. సదరు బ్యాంకులను నాశనం చేస్తే ఆ ప్రభావం తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బ్యాంకుల్లోనూ రద్దయిన నోట్లను తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల్ని ప్రజలు సహించరని అన్నారు. సహకార రంగ బ్యాంకుల్లో కూడా రద్దయిన నోట్లను స్వీకరించాలంటూ కేరళ ఎంపీలు ప్రధాని మోదీని కలసి కోరనున్నారు.