: చంద్ర‌బాబు లాంటి వారికైతే ఫ‌ర్వాలేదు ఎందుకంటే, వారికి ముందే తెలిసిపోయింది: బొత్స‌ సత్యనారాయణ


పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా క్యూలే క‌న‌ప‌డుతున్నాయని వ్యాఖ్యానించారు. సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల‌ జ‌రిగే ప‌రిణామాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ముందుగానే అంచ‌నా వేయ‌లేకపోయిందని అన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపాలని ఆయ‌న డిమాండ్ చేశారు. న‌ల్ల‌ కుబేరుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలని, అందుకు అంద‌రూ మద్ద‌తు తెల‌పాలని, కానీ, ఇటువంటి నిర్ణ‌యం తీసుకునే ముందు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అన్నారు. ముంద‌స్తు చ‌ర్య‌ల‌న్నీ తీసుకున్న తర్వాతే ఇటువంటి చర్య‌లు చేప‌ట్టాల‌ని, అయితే ఈ విషయంలో ఎంతో అల‌స‌త్వం క‌న‌ప‌రిచార‌ని, ఇదొక‌ తొంద‌ర పాటు చ‌ర్య అని త‌న‌కు అనిపిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ‘ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లాంటి వారికైతే ఫ‌ర్వాలేదు. ఎందుకంటే ముందుగానే వారికి తెలిసిపోయింది.. వారు జాగ్ర‌త్త‌ప‌డ్డారు. టీడీపీ మంత్రులు, నేత‌లు వారి ద‌గ్గ‌రున్న‌ అవినీతి డ‌బ్బంతా భూముల‌పై ఇన్వెస్ట్ చేసుకున్నారు. సామాన్యులు, రైతులే ఇబ్బందులు ప‌డుతున్నారు’ అని బొత్స వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News