: బీజేపీలో బ్రహ్మచారులెక్కువ... అందుకే రాంగ్ టైంలో నోట్ల రద్దు: బాబా రాందేవ్
పెళ్లిళ్ల సీజన్ లో నోట్ల రద్దును ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలపై యోగా గురు బాబా రాందేవ్ తనదైన శైలిలో జోకులు పేల్చారు. భారతీయ జనతా పార్టీలో బ్రహ్మచారులు అధికమని వ్యాఖ్యానించిన ఆయన, ఇది పెళ్లిళ్ల సీజన్ అని అధికార పార్టీకి తెలియదని, అందువల్లే రాంగ్ టైమ్ లో నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు. వివాహ సీజన్ లో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం తప్పేనని అన్నారు. "ఇదే నిర్ణయాన్ని ఓ నెల రోజుల తరువాత ప్రకటించి వుంటే, పెళ్లిళ్లకు విఘాతం కలిగుండేది కాదు. అయినా ఇక్కడ ఓ మేలు కూడా జరిగింది. చాలా పెళ్లిళ్లు కట్నాలు లేకుండానే జరుగుతున్నాయి" అన్నారు. కాగా, వివాహాలు పెట్టుకున్న వారు అందుకు తగ్గ ఆధారాలు చూపి రూ. 2.5 లక్షలను ఓకేసారి విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే.