: క్యూలు చూసి చలించిపోయిన చిరు వ్యాపారి.. రూ.1.55 లక్షల చిల్లర నోట్లు బ్యాంకులో జమ
నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు చీమలబార్లను తలపిస్తున్న క్యూలను చూసి ఓ చిరు వ్యాపారి చలించిపోయాడు. గంటల తరబడి ప్రజలు నిల్చుండడాన్ని చూసి నొచ్చుకున్నాడు. తనవంతుగా వారి కోసం ఏమైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లో ఉన్న చిల్లర డబ్బులను వెలికి తీశాడు. రూ.10, రూ.50, రూ.100 నోట్లను పోగేశాడు. మొత్తం రూ.1.55 లక్షలు లెక్కకొచ్చాయి. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి బ్యాంకులో జమచేశాడు ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన అవదేశ్ గుప్తా. బ్యాంకుల ముందు ప్రజలు పడుతున్న అవస్థలను చూశానని, వారి ఇబ్బందులను కొంతైనా తొలగించాలనే ఉద్దేశంతోనే చిల్లర నోట్లను బ్యాంకులో జమచేశానని ఆయన పేర్కొన్నాడు. తక్కువ విలువున్న నోట్లను జమచేయడం వల్ల నోట్ల మార్పిడి సమయంలో బ్యాంకు అధికారులు వాటిని అందిస్తారని, కొంతవరకు కష్టాలు తగ్గుతాయని వివరించాడు. ఈనెల 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నోట్ల మార్పిడి కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. పది రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పులేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలకు చలించిన చిరు వ్యాపారి పెద్ద మనసుతో ఈ పనికి పూనుకున్నాడు.