: మానవాళి మనుగడకు మరో గ్రహం చూసుకోవాల్సిందే: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్
మానవాళి మనుగడ కోసం మరో గ్రహం చూసుకోక తప్పదని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేటింగ్ సొసైటీలో 'విశ్వం-మానవాళి పుట్టుక' అనే అంశంపై ప్రసంగించిన హాకింగ్.. భూమి పతనావస్థకు చేరుకుందన్నారు. మరో వెయ్యేళ్లపాటు భూమిపై మానవాళి మనుగడ సాగించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. మానవాళి బతకాలంటే మరో గ్రహాన్ని చూసుకోక తప్పదని పేర్కొన్నారు. మరో వెయ్యేళ్లు మానవాళి మనుగడ ఉంటుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. గత యాభై ఏళ్లుగా భూమిపై అత్యుత్తమ ఆవిష్కరణలు జరిగాయని పేర్కొన్న హాకింగ్, పరిశోధనలకు 2016 గొప్ప సంవత్సరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో తన పాత్ర కూడా ఉండడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. మానవులు కూడా ప్రకృతి వనరుల కిందికే వస్తారని, కాకపోతే దానిని మనం బాగా అర్థం చేసుకోగలిగామని అన్నారు. ఆ దిశగా విజయం సాధించామని వివరించారు. భవిష్యత్తులో బిగ్‌బ్యాంగ్ థియరీని కూడా అర్థం చేసుకుంటామని, గురుత్వాకర్షణ తరంగాలను కూడా వినియోగించగలిగే స్థాయికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళ్ల కింద ఉన్న భూమిని కాకుండా ఆకాశంలోని నక్షత్రాల వైపు చూస్తూ మరిన్ని పరిశోదనలు చేయాలని హాకింగ్ సూచించారు.