: ఓటమితో నిరాశలో కూరుకుపోయా.. ఇంట్లోంచి బయటకు రాకూడదనుకున్నా: హిల్లరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టు హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ఓటమిపాలైన తర్వాత ఇంట్లోంచి బయటకు రావాలని అనుకోలేదని, మంచి పుస్తకం చదువుతూ గడపాలని భావించానన్నారు. హోరాహోరీ పోరులో ట్రంప్ చేతిలో ఓటమి పాలవడం తనను చాలా నిరాశకు గురిచేసిందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నేరుగా ప్రజలతో మాట్లాడిన హిల్లరీ తన మనసులోని భావాలను బయటపెట్టారు. బుధవారం బాలల కార్యక్రమంలో పాల్గొన్న హిల్లరీ ఓటమిపై భావోద్వేగానికి గురయ్యారు. ఓటమి తర్వాత వారం రోజుల పాటు తేరుకోలేకపోయానని, ఎంతో మథనపడ్డానని తెలిపారు. మంచి పుస్తకాలు చదవాలని, కుక్క పిల్లలతో ఆడుకోవాలని అనుకున్నానని, ఇంటి నుంచి అడుగు బయటపెట్టకూడదని భావించానని హిల్లరీ వివరించారు.