: పుజారాపై కోప్పడ్డ కోహ్లీ.. వీడియో పోస్టు చేసిన గంభీర్
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచరుడు ఛటేశ్వర్ పుజారాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలిరోజు ఆటలో సెంచరీలతో అదరగొట్టిన ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశాన్ని మరో ఆటగాడు గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఓపెనర్లిద్దరూ విఫలం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ను నిర్మించాల్సిన బాధ్యత వీరిద్దరిపై పడింది. ఈ దశలో ఆదిల్ రషీద్ వేసిన 18వ ఓవర్లో సింగిల్ తీసే ప్రయత్నంలో పుజారా ముందుకు దూసుకొచ్చాడు. కోహ్లీ అతనిని వారించడంతో వేగంగా వెనక్కి వెళ్లిన పుజారా బ్యాటు వదిలేసి మరీ డైవ్ చేసి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం మరోసారి సింగిల్ కోసం ప్రయత్నించి, వెనుదిరిగి బ్యాటుతో సహా డైవ్ చేసి అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో నిలకడగా ఆడాల్సిన టైమ్ లో లేని పరుగు కోసం పరుగెత్తాల్సిన అవసరం ఏంటని కోహ్లీ, పుజారాను మందలించినట్టు వీడియోలో కనిపిస్తోంది.