: టీ తాగమంటూ ఏటీఎం వాచ్ మన్ రూ.20 ఇచ్చాడు!: ప్రముఖ గాయని చిన్మయి
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఎన్నో అనుభవాలను చవిచూశారు. తాజాగా, ప్రముఖ గాయని చిన్మయి, రాహుల్ దంపతులపై కూడా నోట్ల రద్దు ప్రభావం పడింది. ఈ విషయాన్ని చిన్మయి తన ఫేస్ బుక్ ఖతా ద్వారా తెలిపింది. ‘పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు మేము యూఎస్ లో ఉన్నాము. ఈరోజు ఉదయం ఇండియాకు చేరుకున్నాము. అయితే, మా వద్ద మన కరెన్సీ అసలు లేదు. దీంతో, కనీసం ఒక వంద రూపాయలు అయినా సరే ఏటీఎంలో తీసుకుని, స్థానిక టీ షాపులో టీ తాగుదామని అనుకున్నాం. అక్కడి ఏటీఏం వద్దకు మా ఆయన రాహుల్ వెళ్లాడు. ఉదయం 10 గంటల తర్వాత ఈ ఏటీఎంలో డబ్బులు పెడతారని, డబ్బులు లోడ్ చేసిన రెండు గంటల్లోగా మొత్తం ఖాళీ అయిపోతుందని అక్కడి వాచ్ మన్ చెప్పాడు. దీంతో, వంద రూపాయలు కూడా తీసుకోలేకపోయాం. అయితే, మరువలేని విషయమేమిటంటే, రాహుల్ ను టీ తాగమంటూ ఆ వాచ్ మన్ ఇరవై రూపాయలు ఇచ్చాడు. మనలో చాలా మందికి వారి హృదయాలు ‘రైట్’ ప్లేస్ లో ఉన్నాయి..’ అంటూ చెప్పుకొచ్చింది చిన్మయి శ్రీపాద.