: ఢిల్లీ ఆర్‌బీఐ కార్యాలయ ముట్టడికి మమత, కేజ్రీవాల్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
నల్లధనంతో పాటు నకిలీ నోట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమకు మద్దతు తెలుపుతున్న కార్యకర్తలతో కలిసి ఢిల్లీలోని ఆర్‌బీఐ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. అప్రమత్తమయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దనోట్ల రద్దు అంశంపై అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌మండీ వద్ద కార్మికులు, వ్యాపారులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి కూడా పాల్గొన్నారు. అక్కడ సమావేశం ముగించుకున్న అనంతరమే వారు ఆర్‌బీఐ కార్యాలయానికి బయలుదేరి ఆందోళన చేపట్టారు.