: మహారాష్ట్రలో రూ.73 లక్షల పాతనోట్లు.. ఢిల్లీలో రూ.69.86 లక్షల విలువైన వంద నోట్లు స్వాధీనం!
నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎందరో నల్లకుబేరులు పోలీసులకు పట్టుబడుతున్నారు. మహారాష్ట్రలో తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసులు తాజాగా రెండు కార్లలో రద్దయిన నోట్లతో కూడిన 73 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నాసిక్ నుంచి కోపర్‌గావ్ వైపు వెళ్తున్న కారులో రూ. 32,99,500 దొరకగా, గుజరాత్ నుంచి వైజాపూర్ వైపు వస్తోన్న మరో కారులో రూ.40 లక్షలు దొరికాయి. నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు, ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో పోలీసులు రూ.69.86 లక్షలను స్వాధీనం చేసుకోగా అన్నీ వందనోట్లే కావడం గమనార్హం. ఆ ప్రాంతంలోని పిల్లల వైద్యుడు నల్లాల్ ఈ నోట్లన్నింటినీ తన కారులో పెడుతుండగా ఓ స్థానికుడు గమనించి, పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని రూ. 69.86 లక్షల విలువైన వంద నోట్లను స్వాధీనం చేసుకొని ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ డబ్బంతా వ్యాపారవేత్త అయిన తన స్నేహితుడు తనకు ఇచ్చాడని, తన కారులో రాజౌరి గార్డెన్‌లోని తన స్నేహితుడి ఇంటికి ఈ డబ్బుని తీసుకెళుతున్నానని చెప్పాడు.