: పెళ్లి వేడుకల్లో గిఫ్టులుగా బ్యాంకు చెక్ లు, పాతనోట్లు మాత్రమే ఇస్తున్నారు!
నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ప్రస్తుతం నగదు కొరతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లి వేడుకలు సజావుగా సాగేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో, వివాహ వేడుక సందర్భంగా చదివించే కానుకల విషయంలో ఇప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా, ఓ గిప్టును లేదా కొంత నగదును పెళ్లి వేడుకలకు వచ్చిన బంధువులు, మిత్రులు చదివిస్తుండడం కనిపించేది. కానీ, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఇప్పుడు పెళ్లి కొడుకు, కూతురికి కట్నకానుకలుగా బ్యాంకు చెక్లను, పాతనోట్లను ఇస్తూ కనిపిస్తున్నారు. గిఫ్టుకొనడానికి దుకాణాలకు వెళితే చిల్లర మాత్రమే ఇవ్వాలని వ్యాపారులు కోరడం వల్ల, ఎన్నో దుకాణాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఈ పరిస్థితి వస్తోంది. పెళ్లి వేడుకల సందర్భంగా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వెళ్లిన పెళ్లి కూతురు తల్లిదండ్రులకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది వ్యాపారులు మాత్రమే చెక్స్ను తీసుకుంటున్నారు, ఎంతో మంది నగదునే అడుగుతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. పెళ్లి వేడుకల కోసం చిన్నచిన్న వస్తువులను కొనుక్కోవడానికి నగదు తప్పకుండా అవసరం అవుతుంది. దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.