: తన భర్తకు దగ్గరైందని.. చిన్ననాటి స్నేహితురాలిని చంపేసిన యువతి
తన భర్తకు దగ్గరై అక్రమ సంబంధాన్ని నడుపుతోందన్న అనుమానంతో చిన్నప్పటి నుంచి కలసి తిరుగుతూ, కలసి పెరిగిన స్నేహితురాలని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిందో యువతి. ఆపై కట్టుకథలు అల్లి, చివరకు పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది. జైపూర్ సమీపంలోని చురులో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, బబిత, మనీషా చిన్నప్పటి నుంచి స్నేహితులు. మనీషా వివాహం సైన్యంలో పనిచేసే అజయ్ తో జరిగింది. పెళ్లయిన తరువాత బబిత కూడా అజయ్ కి దగ్గరైందన్నది మనీషా అనుమానం. వారిద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నారని తెలుసుకున్న ఆమె, బబితను చంపేందుకు నిర్ణయించుకుంది. "అజయ్ వస్తున్నాడు. బస్టాండ్ కు వెళుతున్నాను. తోడు వస్తావా?" అని బబితను అడిగి, ఆమెను బస్టాండ్ సమీపంలోని ఓ చెరువు వద్దకు తీసుకెళ్లింది. ఆపై తన చేతికున్న ఎంగేజ్ మెంట్ రింగ్ ను చెరువులోకి వదిలి, దాన్నెలాగైనా తెచ్చివ్వాలని బబితను కోరింది. లోతు ఎక్కువగా ఉన్నప్పటికీ, తాడు సాయంతో దిగిన బబిత, ఉంగరాన్ని తీసుకుని పైకి రాబోగా, ఆమెను గట్టిగా తన్నుతూ నీటిలోపలికి తొక్కేసింది మనీషా. దీంతో ఊపిరాడక ఆమె చనిపోగా, ఏమీ తెలీనట్టు ప్రమాదం జరిగిందని నలుగురికీ చెప్పింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం ఒప్పుకుంది.