: అమెరికా ప్రయాణంలో.. బొద్దింక ఉన్న భోజనం పెట్టిన ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా అందించిన భోజనంలో ఏకంగా బొద్దింక ప్రత్యక్షమవడంతో ఆ ప్రయాణికుడు బిత్తరపోయాడు. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా షికాగో వెళుతున్న విమానంలో రాహుల్ రఘువంశీ అనే ప్రయాణికుడు అమెరికా బయలుదేరాడు. మార్గమధ్యంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది రఘువంశీకి భోజనం అందించారు. ఆ భోజనంలో చచ్చిపోయిన బొద్దింక వచ్చింది. దాన్ని మొబైల్ తో ఫొటో తీసి, ట్విట్టర్ లో పోస్ట్ చేశాడాయన. అయితే, జరిగిన ఘటన విషయంలో ఆయనకు ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. విమానంలో భోజనం అందించే కేటరింగ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, జరిగిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని అధికారులు తెలిపారు. మరోవైపు, బొద్దింకలతో కూడిన శాకాహారాన్ని ఎయిర్ ఇండియా పెడుతోందని... దీని వల్ల తాను అనారోగ్యానికి గురయ్యానని ట్విట్టర్లో రఘువంశీ తెలిపాడు.