: మనుషులు చనిపోతున్నా మొద్దు నిద్రేంటి?: లోక్ సభ పోడియంలో నినాదాలిస్తూ నిరసన తెలుపుతున్న ఎంపీలు


పెద్ద నోట్ల రద్దు అంశం గురువారం నాడు ఉభయసభలనూ కుదిపేస్తోంది. ఇప్పటికే రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడగా, లోక్ సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూల్లో నిలబడి మనుషులు మరణిస్తున్నా నరేంద్ర మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీల ఎంపీలు పోడియంలోకి ప్రవేశించి ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యులు శాంతించాలని, చర్చకు ప్రభుత్వం సిద్ధమని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిమార్లు ప్రకటించినా, విపక్ష సభ్యులు వినలేదు. మోదీ సర్కారును ఎండగడుతూ, చర్చకు పట్టుబడుతుండగా, నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను సాగిస్తున్నారు. లోక్ సభలో ప్రధాని మోదీ కనిపించక పోవడాన్ని విపక్షాలు తప్పుబడుతూ, ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సుమిత్రా మహాజన్ అవకాశం ఇవ్వగా, ఆయన ప్రసంగిస్తూ, దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారని, ఒక ఇంట్లోని వారు ఎవరో ఒకరు రోజంతా తమ పనిని వదులుకొని బ్యాంకుల ముందు నిలబడాల్సిన పరిస్థితిని మోదీ కల్పించారని విమర్శించారు. తక్షణమే పరిస్థితిని చక్కబెట్టాలని, లేకుంటే రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించి జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News