: 'దొడ్డ' మనసు.. స్కూలు అభివృద్ధి కోసం రూ.కోటి విలువైన ఇల్లు, ఖాళీ స్థలాన్ని రాసిచ్చిన వ్యక్తి!
తాను చదువుకున్న స్కూలును అభివృద్ధి చేయాలన్న గొప్ప ఆశయంతో పారిశ్రామికవేత్త దొడ్డా మోహన్‌రావు ఆ పాఠశాలకు భారీగా విరాళాన్ని అందించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో తనకున్న రూ.కోటి విలువైన ఇల్లు, ఖాళీ స్థలాన్ని స్కూలు కోసం విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నర్సంపేటలోని జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో ఆయన చదువుకున్నారు. అది ఇప్పుడు బాలికోన్నత పాఠశాలగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డ మోహన్‌రావు తాను చదువుకున్న పాఠశాలను మాత్రం మరచిపోలేదు. ఆ పాఠశాలను దత్తత తీసుకుని బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పటికే తన సొంత డబ్బుతో పాఠశాల కోసం రెండస్తుల భవనాన్ని కట్టించారు. అయితే, విద్యార్థులతో కిక్కిరిసిపోతున్న ఆ పాఠశాల భవనంలో ఇప్పటికీ సరిపడా గదులతో పాటు పిల్లలు ఆడుకోవడానికి మైదానం కూడా లేదు. ఈ విషయాన్ని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు మోహన్‌రావుకి చెప్పారు. దీంతో ఆయన పాఠశాల పక్కనే శిథిలావస్థలో ప్రభుత్వ నీటి పారుదలశాఖ డీఈఈ ఆఫీసు ఉందని తెలుసుకున్నారు. తనకు నర్సంపేటలో ఉన్న భవనాన్ని ఆ ఆఫీసుకు రాసిస్తానని, దానికి బదులుగా విద్యార్థుల కోసం డీఈఈ ఆఫీసుని ఇచ్చేయాలని అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. అధికారులు అంగీకరించడంతో నిన్న స్కూలుకి వెళ్లిన మోహన్‌రావు తన రూ.కోటి విలువైన ఇల్లు, ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో అధికారులకు అందించారు. మోహన్‌రావుకి ఉన్న సామాజిక సృహ పట్ల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.