: 'యేహై మేరీ మన్ కీ బాత్' అన్న బిల్ గేట్స్!
నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం భారత భవిష్యత్తుకు అత్యంత మేలు చేసే నిర్ణయమని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. అనతి కాలంలోనే ఇండియా డిజిటైజ్డ్ ఎకానమీగా రూపాంతరం చెందనుందని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరగనుందని, వృద్ధి పథంలో భారత్ దూసుకెళుతుందని అన్నారు. పాత నోట్ల రద్దు, జీఎస్టీ.. భారత వృద్ధి బాటన తొలి అడుగులు మాత్రమేనని అభివర్ణించిన ఆయన, మోదీ నాయకత్వంలో ఇండియా గొప్ప దేశంగా ఎదగనుందని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు ఇండియా నుంచి సమాధానాలు రానున్నాయని ఆయన అన్నారు. 'నీతి లెక్చర్స్ సిరీస్: ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా'లో భాగంగా ప్రసంగించిన ఆయన, ఆధార్, స్టార్టప్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి వాటిని ప్రస్తావించారు. 'యేహై మేరీ మన్ కీ బాత్' ( నా మనసులో ఉన్నది ఇదే) అంటూ తన ప్రసంగాన్ని ముగించి, అందరి చేతా కరతాళధ్వనులు చేయించిన ఆయన, డిజిటల్ ఇండియా కల సాకారం కానుందని, 'మైగౌ'లో భాగంగా ఎన్ని ఎక్కువ సేవలు డిజిటలైజ్ అయి ప్రజలకు దగ్గరైతే, ఇండియా అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.