: ఫ్లాష్ బ్యాక్: విధితో పోరులో విజేతగా నిలిచిన మహిళ.. ఎముకలు కొరికే చలిలో రెండేళ్లు!
ఇది 1921 నాటి సంగతి. అలస్కా నుంచి చుక్చీ సముద్రం మీదుగా రష్యాలోని రాంగెల్ దీవికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రఖ్యాత కెనడియన్ శాస్త్రవేత్త, అర్కిటిక్ అన్వేషకుడు విల్జామర్ స్టెపాన్సన్ ఓ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. అర్కిటిక్ లోని మంచు సముద్రాల మీదుగా వందలమైళ్లు కాలినడక సాగే ఈ యాత్రకు సాహసయాత్ర అనే పేరు సరిపోదంటే అతిశయోక్తి కాదేమో. ఈ యాత్ర కోసం కెనడాకు చెందిన అబ్లాన్ క్రాఫార్డ్‌ను విల్జామర్ నాయకుడిగా ఎన్నుకున్నారు. లార్నేనైట్, మిల్టన్ గాల్లే, ఫ్రెడ్ మారెర్ అనే ముగ్గురు అమెరికన్లను సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ గతంలో ఇటువంటి యాత్రలు చేసిన అనుభవం ఉంది. ఈ మొత్తం బృందానికి వంట చేసేందుకు బ్లాక్‌జాక్ అనే ఇరవై మూడేళ్ల ఇన్యూట్ తెగ మహిళను ఎంపిక చేశారు. అందరూ కలిసి ఓ శుభముహూర్తాన యాత్రకు బయలుదేరారు. వీరి ప్రయాణానికి ఆర్థికంగా చేయూత అందించిన స్టెపాన్సన్ మాత్రం యాత్రకు దూరంగా ఉన్నారు. సెప్టెంబరు 16, 1921న వీరి సాహసయాత్ర (అన్వేషణ యాత్ర) ప్రారంభమైంది. మొదట్లో ఉత్సాహంగా సాగిన ప్రయాణంలో తర్వాత కష్టాలు మొదలయ్యాయి. గడ్డకట్టిన మంచు సముద్రంపై నడుస్తున్న కొద్దీ శరీరంలో క్రమంగా మార్పులు చోటుచేసుకోవడం ప్రారంభమైంది. ఆగుతూ సాగుతూ వీరి ప్రయాణం ఏడాదిన్నరపాటు సాగింది. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న సరుకులు అయిపోవడం, వాతావరణం ప్రతికూలంగా మారడంతో ముందుకు కదిలే మార్గం కనిపించలేదు. గమ్యం మాత్రం ఇంకా చాలాదూరంలో ఉంది. ఆకలి నుంచి బయటపడేందుకు సీల్ చేపలను వేటాడి తిన్నారు. ప్రయాణం ఇక ఎక్కువ కాలం సాగదని గ్రహించారు. దీంతో సాయం, ఆహారం కోసం సైబీరియా వెళ్లేందుకు మిల్టన్ గాల్లె, మారెర్, క్రాఫార్డ్‌లు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే అనారోగ్యం బారిన పడిన లార్నెనైట్‌కు తోడుగా బ్లాక్‌జాక్‌ను అక్కడే విడిచిపెట్టి జనవరి 28, 1923న సైబీరియా బయలుదేరారు. నైట్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో బ్లాక్‌జాక్ అతడికి సపర్యలు చేస్తూ మరోవైపు సీల్ చేపలను వేటాడుతూ ఆహారం సంపాదించేది. అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన ధ్రువపు ఎలుగుబంట్ల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ పెద్ద సాహసమే చేసింది. చివరికి ఏప్రిల్లో నైట్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన ప్రాణాలు విడిచాడు. దీంతో ఒంటిరిగా మారిన బ్లాక్‌జాక్ ప్రయాణం మొదలుపెట్టింది. ఎన్నో ఇబ్బందులు పడింది. చివరికి ఆగస్టు 19న కొందరు నావికులు ఆమెను కనుగొని తిరిగి బాహ్యప్రపంచంలోకి తీసుకొచ్చారు. నరకం అంచులను చూసి తిరిగి ప్రాణాలతో వచ్చిన బ్లాక్‌జాక్‌ను మీడియా ఓ రాక్షసిలా చిత్రీకరించింది. నైట్ మరణానికి ఆమే కారణమని నిందించింది. నైట్ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. సమాజం దృష్టిలో విలన్‌గా మారిన బ్లాక్‌జాక్ జీవిత కథ గురించి తర్వాతి కాలంలో అనేక పుస్తకాలు వచ్చాయి. జీవితాంతం పేదరికంలో మగ్గిన ఆమె 85 ఏళ్ల వయసులో ఓ అనాథ శరణాలయంలో తుదిశ్వాస విడిచింది.