: పారా మిలటరీ దళాల వలయంలో దంతెవాడ!
మరో ఆరుగురు మావోయిస్టుల ఎన్ కౌంటర్ తరువాత దంతెవాడ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున పారా మిలటరీ దళాలు కూంబింగ్ ను నిర్వహిస్తున్నాయి. నిన్న సాయంత్రం చత్తీస్ గఢ్ లోని దంతెవాడ సమీపంలోని అడవుల్లో తమకు తారసపడిన మావోలను లొంగిపోవాలని హెచ్చరించిన పోలీసులు, ఆపై వారు కాల్పులు ప్రారంభించగానే ఎన్ కౌంటర్ జరుపగా, ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో స్వల్ప వ్యవధిలోనే మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బూర్గంపేర్మా అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరుగగా, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ ప్రాంతంలో మరింతమంది మావోలు ఉండవచ్చన్న ఆలోచనతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏఓబీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తరువాత కాస్తంత స్తబ్ధుగా ఉన్న ఆంధ్రా - ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం, తాజా ఘటనతో మరోసారి ఉలిక్కిపడింది. మరణించిన వారిలో ముగ్గురు మహిళా మావోలున్నారని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.