: 500 కోట్లు కాదు, 600 కోట్లు కాదు... 'గాలి'వారి ఇంట పెళ్లి ఖర్చు రూ. 30 కోట్లే!


ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఒకటైన జంట. చూసేందుకు విచ్చేసిన 50 వేల మంది అతిథులు. వారికి వండి వడ్డించేందుకు 5 వేల మంది, భద్రతా ఏర్పాట్ల కోసం 3 వేల మంది సెక్యూరిటీ... బెంగళూరు నడిబొడ్డున ఉన్న ప్యాలెస్ మైదానం వేదికగా జరిగిన గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ వేడుకలో కనిపించిన దృశ్యాలివి. ఈ పెళ్లికోసం తాను అక్రమంగా సంపాదించిన వందల కోట్లను గాలి ఖర్చు చేస్తున్నాడని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, వాస్తవానికి ఈ వివాహానికి ఆయన అంత పెద్ద మొత్తంలో ఏమీ ఖర్చు చేయలేదట. అన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ సాగినందున హంగు, ఆర్భాటం కనిపిస్తోందే తప్ప, ఖర్చు పెద్దగా కాలేదని ఆయన బంధువులు అంటున్నారు. వివాహం కోసం రూ. 30 కోట్ల వరకూ ఖర్చు అయిందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని గాలి జనార్దనరెడ్డి బంధువొకరు వ్యాఖ్యానించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఖర్చులకూ చెల్లింపులను పెద్ద నోట్ల రద్దుకు పూర్వమే చెక్కుల రూపంలో చెల్లించినట్టు తెలిపారు. కాగా, ఈ వివాహానికి ఎంత ఖర్చుపెడుతున్నామన్న విషయాన్ని వెల్లడించేందుకు గాలి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్కలోనిదేనని, పన్ను చెల్లించినదేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News