: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు.. పేట్ బషీరాబాద్‌లో కలకలం
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. పోలీసుల కథనం ప్రకారం.. పేట్ బషీరాబాద్‌లోని బాపూనగర్‌కు చెందిన నాగేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ స్థలం విషయంలో వాజ్‌పాయినగర్‌కు చెందిన తేజతో నాగేందర్‌రెడ్డికి గత మూడు నెలలుగా వివాదం ఉంది. నిన్న రాత్రి 10.45 గంటలకు బాపూనగర్‌లోని నాగేందర్‌రెడ్డి ఇంటికి వచ్చిన తేజ రివాల్వర్‌ను అతడి తలపై గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తేజ నుంచి తప్పించుకునేందుకు నాగేందర్ ప్రయత్నించాడు. అంతలోనే తేజ కాల్పులు జరపడంతో బుల్లెట్ నాగేందర్‌రెడ్డి వెన్నులో దిగింది. రెండో బులెట్ మిస్‌ఫైర్ అయింది. నాగేందర్‌రెడ్డి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే తేజాను పట్టుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నాగేందర్‌రెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.