: నోట్ల కష్టాలు తీర్చేందుకు విపత్తు నివారణ సమయంలో పనిచేసినట్టు పనిచేయండి.. కలెక్టర్లకు చంద్రబాబు సూచనలు
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు విపత్తు నివారణ సమయంలో పనిచేసినట్టు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లకు సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బుధవారం చంద్రబాబు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాల్లో ముఖ్యమైన వ్యాపారులు, ఎక్కువ లావాదేవీలు జరిపే వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రేషన్ డీలర్లతో గురువారం సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. చెల్లింపులన్నీ ఆన్లైన్లో మొబైల్ టు మొబైల్ ఫోన్ ద్వారా చేపట్టాలని అన్నారు. జన్‌ధన్ ఖాతాలకు సీడింగ్ ఇవ్వాలని, ఉపాధి కూలీలకు నగదు వారి ఖాతాల్లో జమచేయాలని పేర్కొన్నారు. కూలీలు, పేదలు ఇబ్బందులు పడకుండా చిన్న నోట్లను ఏటీఎంలలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.