: కూతురి వివాహానికి చలామణిలో ఉన్న నగదు దొరకకపోవడంతో పెళ్లికి ఒక్కరోజు ముందు తండ్రి మృతి
నల్లధనాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి వేడుకలు కూడా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. వ్యాపారులు, పనివారు పెద్దనోట్లను స్వీకరించేందుకు నిరాకరిస్తుండడంతో పాటు వివాహ ఖర్చుల నిమిత్తం బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా తన కుమార్తె వివాహ వేడుకకు డబ్బులు దొరకలేదనే మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆ దిగులుతోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లా సహత్వార్ పరిధిలో చోటు చేసుకుంది. ముందుగా ముహూర్తం పెట్టుకున్న ప్రకారం, సురేష్ సోనార్ కుమార్తెకు ఈ రోజు వివాహం జరగాల్సి ఉంది. అందుకోసం పెళ్లికూతురుకి నిన్న తిలక ధారణ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. అందుకు డబ్బు అవసరమై సోనార్ తన వద్ద రద్దైన నోట్లను మార్చుకునేందుకు ఎస్బీఐ వద్దకు వెళ్లాడు. అక్కడ ఎంతో సేపు క్యూలో నిలబడి చివరకు తగినంత డబ్బు దొరకకపోవడంతో నిరాశగా ఇంటికి వచ్చాడు. కూతురి వివాహవేడుకకు తన వద్ద తగినంత డబ్బు లేదని ఆవేదన చెందాడు. అదే దిగులుతో ఆయనకు నిన్న రాత్రి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.