: భారత్ లో గణనీయంగా పెరిగిపోతున్న 'హై బీపీ' రోగులు
భారత్‌లో గత ఏడాది డిసెంబరు నాటికి హై బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరిందని ఓ అధ్యయనం ఆధారంగా లాన్సెట్ జర్నల్ తాజాగా ఓ వ్యాసం ప్రచురించింది. దీని ప్రకారం భారత్‌లో హై బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. అత్యధిక జనాభా కలిగిన చైనాలోనూ హై బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య 22.60 కోట్లుగా ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 40 ఏళ్లలో హై బీపీతో బాధపడుతున్నవారి సంఖ్య రెండింతలు పెరిగిందని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. గత ఏడాది నాటికి 113 కోట్లమంది హై బీపీతో బాధపడుతున్నారు. వారిలో పేద దేశాలతో పాటు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వారి సంఖ్యే అధికమని తెలిపింది. హైబీపీతో బాధపడుతుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, ఆ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది మొత్తం 75 లక్షల మంది మరణిస్తున్నారని పేర్కొంది. హైబీపీతో బాధపడుతున్న 113 కోట్ల మందిలో దక్షిణాసియా వాసులు 23 శాతం, తూర్పు ఆసియా వాసులు 21 శాతం మంది ఉన్నారు. మహిళల కన్నా పురుషులే అధిక సంఖ్యలో హై బీపీతో బాధపడుతున్నారని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. యూరప్ దేశాల్లో బ్రిటన్‌లో హైబీపీతో బాధపడుతున్న వారు అత్యధికంగా ఉన్నారని చెప్పింది. అమెరికా, కెనడా, దక్షిణా కొరియాల్లోనూ అత్యధిక మంది దీని బారిన పడ్డారని పేర్కొంది.