: సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితా విడుదల... తొలిస్థానంలో డెన్మార్క్, అమెరికాకు 13వ ర్యాంకు
ప్రపంచంలో ప్రజలు అత్యంత సంతోషంగా ఉంటున్న దేశాల్లో గత ఏడాది మూడోస్థానంలో ఉన్న డెన్మార్క్ ఈ ఏడాది మొదటిస్థానం కైవసం చేసుకుంది. వరల్డ్ హాపీనెస్ లెవెల్స్ పేరిట జరుపుతున్న అధ్యయనంలో తాజాగా 156 దేశాల జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయంతో పాటు ఆ దేశ ఆరోగ్య స్థితిగతులు, జీవన విధానం, స్వేచ్ఛను ప్రాతిపదికగా తీసుకుని పరిశోధన చేశారు. అన్ని అంశాల్లో మెరుగైన రేటింగ్ సంపాదించుకున్న డెన్మార్క్ తొలిస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, ఫిన్‌లాండ్ దేశాలు నిలిచాయి. ఆ తరువాతి స్థానాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచింది, కాగా, జర్మనీ 16, బ్రిటన్ 23 స్థానాల్లో నిలిచాయి. ఈ అంశంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు జెఫ్రీ సాచ్స్ మాట్లాడుతూ.. అమెరికా లాంటి డబ్బు వెంట పరుగెత్తుతున్న దేశాలు వరల్డ్ హాపీనెస్ లెవెల్స్ ఇచ్చిన ర్యాంకింగ్ నేపథ్యంలో ఇదో సందేశంగా స్వీకరించాలని అన్నారు. సామాజిక స్వరూపం మార్చుకోవాలని, ప్రభుత్వాల పట్ల పౌరులు విశ్వాసం చూపలేకపోతున్నారని అన్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే దేశాలు కృషి చేస్తే మానవ సంక్షేమానికి అవరోధమేనని వరల్డ్ హాపీనెస్ లెవెల్స్ సంస్థ ప్రతినిధులు అన్నారు. సామాజిక, పర్యావరణ విషయాలపై దృష్టి పెట్టకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే మనిషి మనుగడకే ముప్పు అని హెచ్చరించారు. ప్రజలు సంతోషంగా జీవించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంలో తూర్పు యూరప్ దేశాలైన లాత్వియా, స్లొవేకియా, ఉజ్బెకిస్తాన్, రష్యాతో పాటు పలు దేశాలు మరింత పురోగతి చెందాయని చెప్పారు.