: నగదులో ఉన్న నల్లధనం 6 శాతం మాత్రమే!: రాజ్యసభలో సీతారాం ఏచూరి
అసలు నగదులో ఉన్న నల్లధనం 6 శాతం మాత్రమేనని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. పెద్దనోట్ల రద్దు అంశంలో రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ... నల్లధనాన్ని నియంత్రించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ధాన్యం ధర గణనీయంగా పడిపోయిందని, రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లక్షల ట్రక్కులు జాతీయ రహదారులపై ఉండిపోయాయని సీతారాం ఏచూరి చెప్పారు. మొండి బకాయిలని చెప్పి ఎస్బీఐ ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలను రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. స్వీడన్‌లో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని, అక్కడ 100 శాతం ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని, మన దేశంలో ఎంత శాతం మంది ప్రజలు ఆన్ లైన్ సేవలను వినియోగించుకుంటున్నారని ఆయన అడిగారు.