: పాత నోట్లు మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న మావోయిస్టులు


పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల కష్టాలు అమాంతం పెరిగాయి. రద్దు నిర్ణయం వెలువడగానే వారు షాక్ కు గురయ్యారు. ఖర్చులకు డబ్బు లేకపోవడంతో, పాత నోట్లను మార్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. వసూళ్ల ద్వారా సంపాదించిన డబ్బును... ఆదివాసీల సహాయంతో మార్చుకునేందుకు మావోలు యత్నిస్తున్నారని జార్ఖండ్ రాష్ట్రంలోని లతెహార్ జిల్లా ఎస్పీ అనూప్ బిర్తరే ఈ రోజు మీడియాకు తెలిపారు. జార్ఖండ్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోల నోట్ల మార్పిడిపై నిఘాను పెంచామని... దీంతో, ఆదివాసీల సహాయంతో వారు నోట్లు మార్చుకుంటున్నట్టు తెలిసిందని చెప్పారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ తన జనధన్ ఖాతాలో రూ. 4.5 లక్షలు జమచేసేందుకు ప్రయత్నించిందని... అయితే బ్యాంక్ అధికారులు పాన్ కార్డు అడగడంతో, ఆమె కంగారుగా వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. ఆ మహిళకు కనీసం తన దగ్గరున్న నోటు విలువ కూడా తెలియదని ఎస్పీ అన్నారు. బలవంతపు వసూళ్లు, బెదిరింపుల ద్వారా మావోయిస్టులు డబ్బు సంపాదించారని... ఈ డబ్బును మార్చాలని ఎవరైనా ప్రయత్నిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. కొంత మంది కమిషన్ ఏజెంట్లు కూడా మావోలకు సహకరిస్తున్నారని... 20 నుంచి 30 శాతం కమిషన్ తీసుకొని పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News