: 48 గంటల పాటు ముద్రగడను గృహ నిర్బంధంలోనే ఉంచుతాం: పోలీసులు
కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగిస్తోన్న మాజీమంత్రి, కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయనను నిన్న సాయంత్రం పోలీసులు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఉన్నారని, 48 గంటల పాటు ఆయనను ఇంట్లోనే ఉంచుతామని పోలీసులు తెలిపారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని ఇటీవలే పోలీసులు పేర్కొన్నారు. అయితే, శాంతి యుతంగా పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ముద్రగడ తన పాదయాత్రకు తమ అనుమతి కోరితే పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకి నిరసనగా కిర్లంపూడిలో ఈ రోజు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. ముద్రగడ గృహ నిర్బంధం నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.