: మోదీజీ, మీ అమ్మగారి బాధే... దేశంలో అమ్మలందరిదీ: రాంగోపాల్ యాదవ్
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి బాధే దేశంలోని ప్రతి తల్లి అనుభవిస్తోందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఒక జీవిత కాలం పాటు తాను దాచుకున్న డబ్బులను మార్చుకునేందుకు ప్రధాని తల్లి బ్యాంకుకు వెళ్లారని, అలాగే ప్రతి తల్లి బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారని ఆయన చెప్పారు. జీవిత కాలం పైసాపైసా జమచేస్తే... ఆ డబ్బులు లాగేసుకుంటామని కేంద్రం చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీశారు. ప్రజలు ఇంతే ఉంచుకోవాలి, ఇంతకంటే ఎక్కువ ఉంచుకుంటే లాగేసుకుంటామని చెప్పడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. దేశంలో అత్యధిక శాతం తమను సమర్థిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారని, సోషల్ మీడియాను చూసి భ్రమల్లో బతకొద్దని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో రోటీ కర్రతో వీపు వాచిపోయే సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. యూపీలో బంగాళాదుంపల పంట చేతికందే సమయమని, కేంద్రం నిర్ణయంతో ఆ పంటను కొనేవారే లేకుండా పోయారని ఆయన తెలిపారు. పంటకోసం పొలంలో పని చెయ్యాల్సిన గ్రామీణ ప్రజలు బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిల్చుని పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.