: ఫుల్ స్టాప్, కామా లేకుండా 224 పేజీల నవల... ప్రతిష్ఠాత్మక గోల్డ్ స్మిత్ అవార్డు
ఒక్క విరామ చిహ్నం కూడా లేకుండా ఎంతని రాయగలం? మహా అయితే, ఓ పేజీ వాక్యాన్ని రాస్తామేమో. కానీ మైక్ మెక్ కార్మక్స్ అనే రచయిత, 'సోలార్ బోన్స్' పేరిట ఓ నవలను ఎలాంటి విరామ చిహ్నాలు లేకుండా 224 పేజీలు రాశాడు. ఈ మొత్తం నవలలో ఉండేది ఒకే ఒక్క వాక్యం. దాన్ని ఆపకుండా చదువుతూ వెళ్లాలంటే, కనీసం ఐదారు గంటలు పడుతుంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ నవలకు యూనివర్శిటీ ఆఫ్ లండన్ అందించే ప్రతిష్ఠాత్మక గోల్డ్ స్మిత్ అవార్డు లభించింది. రచయిత మైక్ కు రూ. 8.2 లక్షల నగదు బహుమతిని అందించింది. ఇక ఈ నవలలో, మార్కస్ కాన్వే అనే ఇంజనీర్ హీరో. ఎప్పుడో చనిపోయిన మార్కస్ 'ఆల్ సోల్స్ డే' సందర్భంగా భూమిపైకి వస్తాడు. తన కుటుంబం ఏం చేస్తోంది, సమాజంలో ఏం జరుగుతుంది? అన్న విషయాలు పరిశీలిస్తాడు. ఎంతో మందిని అనారోగ్యానికి గురి చేస్తున్న కలుషిత నీరు, ఇంజనీరింగ్ విభాగం మార్పులు, కన్ స్ట్రక్షన్ రంగంలో కాలుష్యం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయం తదితర ఎన్నో విషయాల్లో తాను బతికి ఉన్నప్పటి పరిస్థితులు, ఇప్పటి మార్పులపై తన మనోగతాన్ని మార్కస్ నెమరేసుకుంటున్నట్టుగా సాగుతుందీ నవల.