: వడ్డీ వద్దు... డబ్బు తీసుకుని వాడుకుని తిరిగివ్వండి చాలు!
తమ వద్ద ఉన్న నల్ల డబ్బును ఎలాగోలా లెక్కలోకి తీసుకు రావాలని భావిస్తున్న అక్రమార్కులు వడ్డీ లేకుండా, అతి తక్కువగా నామమాత్రపు వడ్డీకి అప్పులిస్తున్నారు. గ్రే మార్కెట్ లో గత వారం వరకూ 30 శాతం వరకూ ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 5 శాతం కన్నా దిగువకు వచ్చి చేరింది. మరో నెలన్నర తరువాత పాత కరెన్సీకి ఎలాంటి విలువ లేకపోవడంతో, వాటిని ఇప్పుడే రుణాల రూపంలో ఇచ్చేసి, ఓ రెండు నెలలాగి కొత్త కరెన్సీ రూపంలో వెనక్కు తీసుకోవాలన్నది అక్రమార్కుల ఆలోచనగా తెలుస్తోంది. మరికొందరు ఈ రెండు నెలల వడ్డీని కూడా మాఫీ చేస్తూ ఉచితంగానే రుణాలిస్తామని చెబుతుండగా, మరికొందరు తమ వద్ద నుంచి డబ్బు తీసుకునే వాళ్ల కోసం వెతుకులాడే పనిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం అధికంగా ఉంది. భారీ డిస్కౌంట్ లు ఇచ్చి తక్కువ ధరలకు గృహాలను విక్రయిస్తామని చెబుతున్నా, కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. మరో రెండు నెలల తరువాత, బినామీ ఖాతాలపై దృష్టిని సారిస్తామని మోదీ నుంచి వచ్చిన హెచ్చరికలు సైతం నిర్మాణ రంగంలో డీల్స్ ను చౌకగా మార్చాయి. తీసుకునే రుణ మొత్తాన్ని, తిరిగి చెల్లింపు కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు 18 నుంచి 30 శాతం వరకూ ఉండగా, ఇప్పుడది కనిష్ఠానికి దిగజారింది. అయినప్పటికీ, పాత కరెన్సీ రుణం తీసుకుని, దాన్ని బ్యాంకులో వేసుకుని రిస్క్ తీసుకోవడానికి అత్యధికులు నిరాకరిస్తుండటంతో రుణ దాతలకు ఎటూ పాలుపోవడం లేదు.