: మీరు మాత్రమే దేశభక్తులా?: బీజేపీపై ఆనంద్ శర్మ ఫైర్


బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో చిత్రమైన పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ, 'బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న ఉద్దేశంతో, ఎవరైనా మాట్లాడితే వారిని దేశ వ్యతిరేకులుగా మీరు చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే, మీరు అధికారంలో ఉన్నారు కనుక' అన్నారు. అందుకే ప్రధాని మాత్రమే దేశంలో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. కనీసం విపక్షాల మాటలు వినేందుకు కూడా ప్రధాని సభకు రాలేదని ఆయన అన్నారు. ఆయన గదిలో కూర్చుని మాట్లాడితే మాత్రం అందరూ చూడాలని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నాం కనుక దేశం మాది, మాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాం అంటే కనుక చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. నగదురహిత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడుంది? అని ఆయన ప్రధానిని నిలదీశారు. దేశాన్ని మొత్తం దోచేశారంటున్నారు. మీకు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందా? అని ఆయన నిలదీశారు. గతంలో దేశాన్ని కేవలం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ మాత్రమే పాలించారా? మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి వీళ్లంతా దేశాన్ని దోచేశారా? అని ఆయన నిలదీశారు. టీవీలో కనిపిస్తున్నామనగానే పూనకం వచ్చినట్టు ఊగిపోతారని, ఏం మాట్లాడుతారో కూడా అర్ధం కావడం లేదని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News