: పిచ్చోళ్లుగా మారి దాడులు చేయనున్న నల్లధన అక్రమార్కులు: సైకియాట్రిస్టుల హెచ్చరిక
ఏళ్ల తరబడి వివిధ మార్గాల్లో లెక్కలోకి రాని ధనాన్ని కూడబెట్టి, ఇప్పుడు దాన్ని మార్చుకునే వీలు లేని ఎంతో మంది మానసిక రుగ్మతల బారిన పడి ఇతరులపై దాడులకు దిగే ప్రమాదముందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం లెక్కలోకి రాని ధనాన్ని దాచుకున్న వారికి ఓ పెద్ద భూకంపం లాంటిదని అభివర్ణించారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం తెలియకవారు ఏమైనా చేయవచ్చని తెలిపారు. ఇక ఇంట్లో డబ్బును చూస్తూ, దాన్ని ఏం చేయాలో తెలియని ఎంతో మందికి గుండెపోటు వంటి రోగాలు రావచ్చని, వీరి గురించి కుటుంబ సభ్యులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బు దాచుకున్న వారిలో తొలుత ఆత్రుత పెరుగుతుందని, అది రానురానూ మానసిక ఒత్తిడిని పెంచి గుండెపోటుకు దారి తీస్తుందని సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీశ్ షెట్టి తెలిపారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో ఎంతో మంది ఇబ్బందులు పడుతుండగా, ఏటీఎంలు, బ్యాంకుల ముందు గంటల కొద్దీ నిలబడి ఓపిక నశిస్తున్న వారు, తమ కోపాగ్నిని రకరకాలుగా చూపిస్తున్న ఘటనలు గత రెండు మూడు రోజులుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక నల్లధనం లేకున్నా, తమ భవిష్యత్తు ఏంటన్న ఆలోచన, చేతిలో ఒక్క పైసా కూడా లేకుండా ఉన్న వేళ, ఉద్యోగానికి సెలవు పెట్టి, బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చిన వారికి ఇదే తరహాలో మానసిక ఒత్తిడి కలగవచ్చని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.