: మీలో ఎవరికైనా ఒక్క ధనవంతుడు కనిపించాడా?: కేరింతల మధ్య రాహుల్ ప్రశ్నలు
మహారాష్ట్రలో భివాండీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం పెద్ద నోట్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, దానికి అందరం సంతోషిద్దామని, అయితే కేంద్రం చెబుతున్న నల్లధనం ఎవరి వద్ద ఉందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెబుతున్నట్టు నల్ల ధనం ఉన్నవారెవరైనా ఈ ఎనిమిది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఎవరూ కనిపించలేదని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. కేరింతలతో రాహుల్ కు సమాధానం చెప్పారు. అలాంటప్పుడు ప్రధాని ఎవరిని హింసపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన అడిగారు. దేశ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు. గాంధీ చెప్పిన బాటలోనే తాము నడుస్తామని, గాడ్సే చెప్పిన బాటలో తాము నడవమని, గాంధీ బాటలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమని, కాంగ్రెస్ సత్తా, సామాన్య ప్రజల సత్తా కేంద్రానికి చూపిస్తామని ఆయన అన్నారు.