: గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ, వందేమాతరం నినాదాలతో తృణమూల్ నిరసన
దేశంలో ఏర్పడిన కరెన్సీ సంక్షోభానికి కారణమైన 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం నిర్ణయానికి నిరసనగా నల్లశాలువాలు ధరించి నిరసనలో తృణమూల్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కడుతున్న వ్యాఖ్యలతో ప్లకార్డులు చేబూనిన ఎంపీలు, వందేమాతరం నినాదాలు చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ఎమర్జెన్సీని రద్దుచేయాలని నినాదాలు చేశారు. కాగా, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.