: చరిత్ర సృష్టించనున్న బాబీ జిందాల్... ట్రంప్ మంత్రివర్గంలో చోటు?
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నిన్నంతా బిజీబిజీగా గడిపారు. తన పాలన వర్గాన్ని నియమించుకునే క్రమంలో తీరిక లేకుండా గడిపారు. కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి, పాలన వర్గం ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపారు. ట్రంప్, మైక్ పెన్స్, సెనేటర్ టెడ్ క్రుజ్ తదితరులు దాదాపు 6 గంటలపాటు చర్చల్లో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ ను ఆరోగ్యశాఖ మంత్రిగా, అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్ ను డిఫెన్స్ మంత్రిగా, ట్రెజరీ విభాగానికి స్టీవెన్ నుచిన్ ను నియమించాలని దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం. ఇదే జరిగితే, అమెరికా కేబినెట్ కు ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా బాబీ జిందాల్ చరిత్ర సృష్టిస్తారు. మరోవైపు, ట్రంప్ కు వ్యతిరేకంగా హిల్లరీ మద్దతుదారులు కొందరు చేస్తున్న నిరసన కార్యక్రమాలను గురించి ప్రశ్నించగా, అలాంటి వాటి వల్ల ఉపయోగం ఉండదని సెనేటర్ టెడ్ క్రెజ్ తెలిపారు. అలాంటి వాటిని తాము పట్టించుకోమని... ఇది బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయమని చెప్పారు.