: చైనాకు బ్రేకులు వేసేందుకు పారికర్ ను ఢాకా పంపనున్న మోదీ!
పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు చైనా రోజురోజుకూ దగ్గరవుతున్న వేళ, ఆందోళన చెందుతున్న భారత సర్కారు, పరిస్థితిని చక్కబరిచేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను ఢాకా పంపుతోంది. చైనా నుంచి తొలి సబ్ మెరైన్ ను బంగ్లాదేశ్ సోమవారం నాడు అందుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ తో మాదిరిగానే, బంగ్లాదేశ్ తో కూడా బలమైన స్నేహబంధాన్ని కోరుకుంటున్న చైనా, తన ఆర్థిక శక్తిని ప్రయోగిస్తోంది. బంగ్లా గడ్డపై భారీ ప్రాజెక్టులకు ఉదారంగా సాయాన్ని, రుణాలను అందిస్తోంది. ఇక దీనికి అడ్డుకట్ట వేసి, ఇప్పటికే బలంగా ఉన్న ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పారికర్ పర్యటన సాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 30 నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుందని, ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యం సంయుక్త విన్యాసాలు చేస్తాయని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని ఇచ్చి పుచ్చుకునేలా ఓ ఒప్పందం కుదరవచ్చని సమాచారం.