: ప్రభుత్వాఫీసులో దొంగతనం చేసి... క్షమించమని లేఖ పెట్టిన దొంగ!
ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం చేసిన వ్యక్తి ‘‘నన్ను క్షమించండి’’ అంటూ టేబుల్ పై లేఖను వదిలివెళ్లిన చిత్రమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో పశుసంవర్ధక శాఖ కార్యాలయం తాళాలు పగులగొట్టి చొరబడ్డ దొంగ, 75 వేల రూపాయల విలువ చేసే మూడు కంప్యూటర్లు, ఒక జిరాక్సు మిషన్ ఎత్తుకెళ్లాడు. ఈ సందర్భంగా ఆ కంప్యూటర్లు ఉండాల్సిన టేబుల్ పై ఒక లేఖ వదిలి వెళ్లాడు. ఆ లేఖలో ‘‘నన్ను క్షమించండి.. ఈ కంప్యూటర్లను ఐదేళ్ల తరువాత తిరిగి ఇస్తా"నని పేర్కొన్నాడు. దీనిపై కొల్హాపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఒక దొంగ ఇలా లేఖ రాయడం తన ఇరవై ఏళ్ల సర్వీసులో మొదటిసారి చూశానని ఆయన అన్నారు. ఈ దొంగ విద్యార్థి అయి ఉంటాడని, విద్యావసరాల కోసం ఆ కంప్యూటర్లను చోరీ చేసి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.