: కేసీఆర్ దగ్గర నల్లధనం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు: ఎల్.రమణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద నల్లధనం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని టీడీపీ నేత ఎల్.రమణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పెద్ద కరెన్సీని ఉపసంహరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం గవర్నర్ నరసింహన్ వద్దకు పరుగెత్తారని ఆయన ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుపై కేసీఆర్, మంత్రి ఈటల విభిన్న ప్రకటనలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణలో సంక్షేమం కుంటుపడుతుందని అంటున్నారని, అసలు రాష్ట్రంలో సంక్షేమం అంటూ ఉంటే కదా కుంటుపడడానికి? అని ఆయన విమర్శించారు. నోట్ల రద్దుపై సీఎం ఇప్పటి వరకు కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదని ఆయన ఆరోపించారు.