: ఏటీఎంలో నింపమని డబ్బు ఇస్తే.. వాటితో ఉడాయించిన బ్యాంక్ ఉద్యోగి!
ఏటీఎంలలో నింపడానికి ఇచ్చిన డబ్బుతో ఓ బ్యాంక్ ఉద్యోగి పారిపోయిన సంఘటన తాజాగా పంజాబ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్ సింధ్ బ్యాంకులో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తోన్న తేజ్ ప్రతాప్ సింగ్ భాటియాకు బ్యాంకు అధికారులు ఏటీఎంలో ఉంచేందుకు 6.98 లక్షల రూపాయల నగదును ఇచ్చారు. ఆ డబ్బును మొహాలీ జిల్లాలోని బంకర్‌పూర్ గ్రామంలోని ఏటీఎంలో ఉంచాల్సి ఉంది. భాటియాతో సదరు బ్యాంకు ఇంజినీర్లు, భద్రత సిబ్బంది కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, బ్యాంకుకు సంబంధించిన వాహనంలో కాకుండా తను సొంత వాహనంలో ఏటీఎం కేంద్రానికి వస్తానని చెప్పిన భాటియా.. ఆ డబ్బుని తనవద్దనే ఉంచుకొని మిగతా సిబ్బందిని ఏటీఎం దగ్గరకు పంపించాడు. ఏటీఎం కేంద్రం వద్ద సిబ్బంది ఎంతసేపు ఎదురుచూసినా భాటియా అక్కడకు రాలేదు. సెల్ ఫోన్‌ను కూడా స్విఛాఫ్ చేసి పెట్టుకున్నాడు. అతడి కోసం ఎంతగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.