: తోటి విద్యార్థులు ఏడిపించారు.. అవమాన భారంతో భారత సంతతి విద్యార్థి ఆత్మహత్య


ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ నగరంలో ఈ ఏడాది ఆగ‌స్టులో భారత సంతతికి చెందిన ప‌దిహేనేళ్ల బ్రాండన్ సింగ్ రయత్ అనే స్కూల్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే, తాజాగా ఆ విద్యార్థి త‌ల్లి మీనా ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ గురించి తెలిపారు. స్కూల్లో జ‌రిగిన అవ‌మాన భారంతోనే త‌న కొడుకు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడ‌ని పేర్కొన్నారు. ఆ దేశంలో ప్ర‌స్తుతం జాతీయ అవమాన వ్యతిరేక వారోత్సవాలు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప‌లు వాస్తవాలు వెల్లడించారు. మాన‌సికంగా ఎంతో కుంగిపోయిన త‌న కుమారుడిని ఆసుప‌త్రిలో చేర్చుకొని చికిత్స అందించాలని వైద్యులను తాను వేడుకున్న‌ట్లు ఆమె తెలిపారు. త‌న కుమారుడికి వైద్య సాయం అందినప్ప‌టికీ స‌మ‌ర్థ‌వంతంగా అంద‌లేద‌ని చెప్పారు. స‌రైన చికిత్స అంద‌క‌పోవ‌డంతో త‌న కుమారుడిలో ఆందోళన పెరిగి డిఫ్రెష‌న్‌తో పూర్తి ఫోబియాలోకి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. స్కూల్లో తోటి విద్యార్థులు, టీచ‌ర్లు ఏ ఒక్కరు త‌న కుమారుడిని ఆదరించినా ఈ ప‌రిస్థితి వ‌చ్చేదికాద‌ని ఆవేద‌న చెందింది. స్కూల్లో త‌న కుమారుడిని తోటి విద్యార్థులు ఎంతో అవమానించేవారని, తిట్టేవారని, వారి భ‌యంతోనే స్కూలుకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉన్నాడ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వివ‌రించారు. విద్యార్థి త‌ల్లి మీనా బ్యుటీషియన్ గా ప‌నిచేస్తుండ‌గా, ఆమె భర్త రాజ్ ఒక దుకాణంలో పనిచేస్తున్నాడు. తమ కొడుకు మ‌ర‌ణంతో త‌మ జీవితాల్లో తీవ్ర దుఃఖం నిండిపోయింద‌ని స్కూలులోని విద్యార్థులే త‌మ కుమారుడి చావుకు కార‌ణ‌మ‌ని వారు అంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 9న స‌ద‌రు విద్యార్థి త‌న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కూడా కొన్ని సార్లు ఇటువంటి ప్ర‌యత్నాలే చేసి విఫ‌ల‌మ‌య్యాడు. చేతిని బ్లేడుతో కోసుకోవ‌డం, బ్లీచింగ్ తాగడం లాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌గా చికిత్స తీసుకుని కోలుకున్నాడు. చివ‌రికి ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు జనవరిలో జరగనుంది.

  • Loading...

More Telugu News