: పెద్దనోట్ల రద్దు అంశంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం.. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధం: వెంకయ్య
రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అన్ని అంశాలపై స్పష్టతతో ఉందని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. సామాన్యులంతా ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు మేలు జరగాలన్నదే ప్రధాని ఉద్దేశమని చెప్పారు. కొందరు ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని అన్నారు. బ్యాంకుల్లో ప్రజలకు సరిపడినంత ధనం ఉందని, ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో కొన్ని వదంతులు వ్యాపించాయని, విదేశాలకు ఎగుమతి చేసేటంత ఉప్పు నిల్వలు కూడా దేశంలో ఉన్నాయని చెప్పారు.