: రేపటి నుంచే ముద్రగడ పాదయాత్ర ప్రారంభం.. పాదయాత్ర నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్
కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల పోరాటంలో భాగంగా పాదయాత్రకు దిగుతానని, తనను ఎవరూ అడ్డుకోకూడదని మాజీ మంత్రి, కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. ముద్రగడ పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఆయన పాదయాత్రపై పిిటిషన్ దాఖలైంది. ముద్రగడ పాదయాత్రను నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టులో కోరారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు, పాదయాత్ర సందర్భంగా హింస జరగదని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? అని అడిగింది. పాదయాత్రకు అనుమతి కావాలని తమ వద్దకు ఎవరూ రాలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టులో విచారణను ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.