: ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రధాని మోదీకి ఖుష్బూ సలహా
నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టే నేపథ్యంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడుతున్న అవస్థలపై కాంగ్రెస్ నాయకురాలు, నటి ఖుష్బూ స్పందించారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రధాని మోదీ ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లాలని ఆమె సూచించారు. ప్రధాని మోదీ మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జనాలు ఆయనను నమ్ముతారా? అని ప్రశ్నించారు. మోదీ విధానాలతో దేశ ప్రజలంతా ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారని, వారి ఇబ్బందులను ప్రధాని అర్థం చేసుకోవాలని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్లను రద్దు చేసేముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మోదీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు. ఏటీఎంల వద్ద తోపులాట జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు పడుతున్న కష్టాలకు మోదీదే బాధ్యత అని వ్యాఖ్యానించారు.