: మోసుల్ లో బార్బర్ షాపులకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్!
మోసుల్... దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కబంధహస్తాల్లో చిక్కుకుని తీవ్రంగా ఇబ్బందులు పడిన నగరం. ఇప్పుడు ఇరాక్, అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన దాడులతో ఒక్కో ఉగ్రవాదీ హతం అవుతూ ఉండగా, ఇప్పుడు మోసుల్ నగరం దాదాపు సైన్యం వశమైంది. నిన్న మొన్నటి వరకూ కఠినమైన షరియా చట్టాలు అమలైన ప్రాంతం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుతోంది. ఇక ఉగ్రవాదులుగా ఉన్న వారు కూడా అన్నీ వదిలి జనజీవన స్రవంతిలో కలవక తప్పని వేళ, మోసుల్ లో బార్బర్ షాపులకు డిమాండ్ పెరిగింది. ఎంతో మంది తమ గడ్డాలను తీసేసి నున్నగా షేవ్ చేయించేసుకుంటున్నారు. ఇక సైన్యం మోసుల్ నగరంలోకి ప్రవేశిస్తుంటే, మిగతా షాపులేవీ తెరవకపోయినప్పటికీ, అలీ బషర్ బార్బర్ షాపు తెరచి వుండటం కనిపించింది. అక్కడికి కొద్ది దూరంలోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నలుగురి మృతదేహాలున్నాయి. వారి చేతుల్లో రైఫిల్స్ కూడా ఉన్నాయి. ఇక మోసుల్ లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుతున్న వేళ, గడ్డాలు పెంచుకు తిరిగిన సామాన్యులతో పాటు ఉగ్రవాదులుగా ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారు సైతం, సైన్యం నుంచి తప్పించుకునేందుకు గడ్డాలు తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.