: యుద్ధ విమానాల్లో కరెన్సీని తరలిస్తున్న ఆర్బీఐ
దేశవ్యాప్తంగా వేలాది ఏటీఎం సెంటర్ల వద్ద గంటల కొద్దీ పడిగాపులు, బ్యాంకుల ముందు రోజుల కొద్దీ నిరీక్షణలతో విసిగి వేసారుతున్న ప్రజలు, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకోకముందే పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన కష్టాలను తొలగించాలన్న కృత నిశ్చయంతో ఉన్న అధికారులు యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. వివిధ కరెన్సీ ముద్రణా కేంద్రాల నుంచి ఫైటర్ విమానాల్లో నోట్ల బండిల్స్ ను ఆర్బీఐ కార్యాలయాలకు చేర్చి, అక్కడి నుంచి తిరిగి అవే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు తరలించే పనులు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలకు సరిపడా నగదు కొత్త నోట్ల రూపంలో ఉందని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నగదును దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకూ తరలించేందుకు చర్యలను వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్లలో నగదు బట్వాడాకు అనుగుణంగా సీట్లను తొలగించినట్టు తెలిపారు. కాగా, నాసిక్ లోని కరెన్సీ ముద్రణా కేంద్రంలో మూడు షిఫ్టులుగా కేవలం రూ. 500 నోట్ల ముద్రణను చేట్టారు. దాదాపు 2,500 మంది వర్కర్లు పనిచేస్తున్నారని తయారైన నోట్లు వెంటనే బ్యాంకులకు చేరుతున్నాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.